హైదరాబాద్ లో కరోనా హైరిస్క్ ప్రాంతాల గుర్తింపు... 100కు పైగా కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు యోచనలో అధికారులు!

13-07-2020 Mon 13:02
  • నగరంలో ప్రతిరోజు సరాసరిన 1,250 కరోనా కొత్త కేసులు
  • 8 హైరిస్క్ జోన్లను గుర్తించిన అధికారులు
  • ఒక్కో హైరిస్క్ జోన్లో 10 నుంచి 20 కంటెన్మెంట్ జోన్ల ఏర్పాటు దిశగా అడుగులు
8 Corona high risk zones recognised in Hyderabad

హైదరాబాదులో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజు పలువురు నగరవాసులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో, నగరంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న హైరిస్క్ జోన్లను అధికారులు గుర్తించారు. 500 కేసులకంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా పరిగణిస్తున్నారు. ఇలాంటి జోన్లు నగరంలో 8 ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

మెహదీపట్నం, యూసుఫ్ గూడ, అంబర్ పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్, కుత్బుల్లాపూర్, కార్వాన్, రాజేంద్రనగర్ సర్కిళ్లను హైరిస్క్ జోన్లుగా అధికారులు గుర్తించారు. ఈ జోన్లను హైరిస్క్ జోన్లుగా చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఒక్కొక్క జోన్ లో 10 నుంచి 20 వరకు మొత్తంగా 100కు పైగా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. తద్వారా హైరిస్క్ జోన్ల నుంచి ఇతర ప్రాంతాలకు వైరస్ సోకకుండా కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నారు.