ఈ రోజు ఎక్కడ ఎన్ని కేసులు?... పందెం రాయుళ్ల బిజీబిజీ!

13-07-2020 Mon 11:15
  • ఆటలు, ఎన్నికలు లేకపోవడంతో కరోనా కేసులే దిక్కు
  • కేసులెన్ని, మరణాలెన్ని అన్న పందాల జోరు
  • కర్ణాటకలో సాగుతున్న దందా
New Betting Model Started on Corona

నిన్నటి వరకూ సంక్రాంతి కోడి పందాలు, క్రికెట్, ఎన్నికలపై పందాలు కాసిన బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు కరోనాపై పడ్డారు. దేశంలో కరోనా కేసులు వందల నుంచి వేలు, పదివేల స్థాయికి పెరిగిన నేపథ్యంలో ఎక్కడ, ఎన్ని కేసులు వస్తున్నాయన్నదే వీరికిప్పుడు పందాలు పెట్టేందుకు మార్గాన్ని సుగమం చేసింది.

సాయంత్రం హెల్త్ బులిటన్ విడుదలయ్యే లోగా.. ఈ రోజుకు ఎన్ని కేసులు వస్తాయి? ఏ జిల్లాలో ఎక్కువ కేసులు వస్తాయి? వంటి విషయాలపై బెట్టింగ్ కాసి గెలిస్తే, ఆ వెంటనే అతని ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో ఈ తరహా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఇక, ఎక్కడ మరణాలు ఎక్కువగా ఉంటాయి? వంటి పందాలు కూడా సాగుతున్నాయి.

అయితే, ఈ బెట్టింగ్ లు రూ. 100 నుంచి రూ. 1000 వరకూ సాగుతూ ఉండటంతో, పోలీసుల దృష్టికి కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది. కర్ణాటకలోని మైసూరు, చామరాజనగర తదితర ప్రాంతాల్లో ఈ పందాలు జోరుగా సాగుతున్నాయి.