Sachin Pilot: బ్రేకింగ్... బీజేపీలోకి వెళ్లడం లేదన్న సచిన్ పైలట్!

  • నేడు ఎంఎల్ఏలతో అశోక్ గెహ్లాట్ సమావేశం
  • సమావేశానికి గంటల ముందు సచిన్ పైలట్ కీలక ప్రకటన
  • తామేమీ తొందరపడటం లేదన్న బీజేపీ
Sachin Pilot Says that he is not Going to BJP

తనకు మద్దతుగా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వెల్లడించి, బీజేపీలోకి ఫిరాయిస్తున్నట్టు గత రెండు రోజులుగా సంకేతాలు పంపిన రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, అనూహ్యంగా తన మనసును మార్చుకున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరికాసేపట్లో ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించనుండగా, తొలుత ఈ సమావేశానికి రాబోనని చెప్పిన ఆయన, తాజాగా, తానేమీ బీజేపీలో చేరబోవడం లేదని స్పష్టం చేశారు.

వాస్తవానికి జైపూర్ లో నేడు సీఎం, ఎమ్మెల్యేల సమావేశం జరిగే సమయానికి, సచిన్ పైలట్ న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కావాల్సివుంది. అయితే, కొద్దిసేపటిక్రితం ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన, పార్టీని వీడబోవడం లేదని వెల్లడించారు.

కాగా, కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ అధిష్ఠానం వేచి చూసే ధోరణిని కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, తామేమీ కాంగ్రెస్ ను చీల్చాలని భావించడం లేదని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సచిన్ సన్నిహిత వర్గాలు కూడా బీజేపీతో సంబంధాలపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడకపోవడం గమనార్హం.

సచిన్ పైలట్ కు సీఎం అశోక్ గెహ్లాట్ తో విభేదాలు ఉన్నాయని, రాష్ట్రంలో తనకు తగినంత ప్రాతినిధ్యాన్ని ఇవ్వడం లేదని ఆయన భావిస్తున్నారని, ఆయన బీజేపీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

More Telugu News