అమెరికా యుద్ధనౌక యూఎస్ఎస్ బాన్‌హోం రిచర్డ్‌లో భారీ పేలుడు.. 21 మందికి గాయాలు

13-07-2020 Mon 09:15
  • శాన్‌డియాగో నౌకాదళ స్థావరంలో ఘటన
  • భారీ పేలుడు ధాటికి చెలరేగిన మంటలు
  • ప్రమాద కారణాలపై దర్యాప్తు
Explosion on ship at US naval base injures 21

అమెరికా యుద్ధ నౌకలో నిన్న జరిగిన భారీ పేలుడు, అనంతర అగ్ని ప్రమాదంలో 21 మంది సిబ్బంది గాయపడ్డారు. శాన్‌డియాగో నావికాదళ స్థావరంలో నిలిపి ఉంచిన యూఎస్ఎస్ బాన్‌హోం రిచర్డ్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని మిలటరీ అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో మొత్తం 21 మంది గాయపడగా, వారిలో నలుగురు పౌరులు ఉన్నట్టు చెప్పారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, గాయపడిన 17 మంది నావికులను ఆసుపత్రికి తరలించినట్టు అధికార ప్రతినిధి మైక్ రానీ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. నౌకలో పేలుడు సంభవించినప్పుడు 160 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.