తొలుత నెగటివ్, ఆపై పాజిటివ్... ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యల విషయంలో కన్ఫ్యూజన్ కు కారణమిదే!

13-07-2020 Mon 08:26
  • ఫ్యాన్స్ లో అయోమయాన్ని నింపిన అధికారుల ప్రకటనలు
  • యాంటీజెన్ టెస్టుల తరువాత ప్రొటోకాల్ ప్రకారం ఆర్టీ పీసీఆర్ టెస్టులు
  • రెండోసారి పాజిటివ్ వచ్చిందని ప్రకటించిన అధికారులు
Reason for the Confusion in Aishwarya Aradhya Corona tests

బచ్చన్ కుటుంబంలో కరోనా మహమ్మారి ప్రవేశించడం మొత్తం బాలీవుడ్ నే కలవరపెట్టిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లకు, ఆపై ఆదివారం ఉదయం ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలకు పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు అమితాబ్ కుటుంబీకులకు పరీక్షల విషయంలో కొంత అయోమయం నెలకొంది. ఆపై గంటల వ్యవధిలోనే కన్ఫ్యూజన్ కు అధికారులు తెరదించారు. 

వాస్తవానికి ముంబై మేయర్ కిషోర్ ఫడ్నేకర్ అమితాబ్, అభిషేక్ లకు మినహా మిగతా వారందరికీ కరోనా సోకలేదని ప్రకటించగా, ఆపై మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే మాత్రం జయబాధురికి నెగటివ్ వచ్చిందని, ఐశ్వర్య, ఆరాధ్యలకు పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. ఈ భిన్న ఫలితాల వెనుక ఉన్న కారణాన్ని అధికారులు వెల్లడించారు. 

కరోనా టెస్టుల విషయంలో ప్రొటోకాల్ ప్రకారం తొలుత యాంటీజెన్ టెస్టులు చేసిన శాంపిల్ కు పాజిటివ్ వస్తే, అది కచ్చితంగా పాజిటివే. నెగటివ్ వస్తే మాత్రం, సదరు శాంపిల్ ఆర్టీ - పీసీఆర్ టెస్టుకు పంపించి, నెగటివ్ గా నిర్ధారణ అయితేనే సదరు వ్యక్తికి కరోనా సోకలేదన్న విషయాన్ని నిర్దారించాలి. ఆర్టీ-పీసీఆర్ ఫలితమే కరోనా తుది ఫలితం అవుతుంది.

తొలుత అమితాబ్ కుటుంబీకులందరికీ యాంటీజెన్ టెస్టు నిర్వహించగా, అమితాబ్, అభిషేక్ లకు పాజిటివ్ వచ్చింది. మిగతావారికి నెగటివ్ వచ్చింది. అదే విషయాన్ని ముంబై మేయర్ తొలుత వెల్లడించారు. ఆపై ప్రొటోకాల్ ప్రకారం, ఆర్టీ - పీసీఆర్ టెస్ట్ లను నిర్వహించగా, ఐశ్వర్య, ఆరాధ్యలకు పాజిటివ్ వచ్చింది. ఈ టెస్ట్ ఫలితం రావడానికి 8 గంటల సమయం పడుతుంది. ఈ 8 గంటల వ్యవధిలోనే మీడియాలో వచ్చిన వార్తల కారణంగా అయోమయం ఏర్పడింది.