Sachin Pilot: సచిన్ పైలట్ కు హ్యాండిచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు... పార్టీలో విభేదాలు లేవన్న కాంగ్రెస్!

  • రెండు రోజుల నాడు ఢిల్లీలో సచిన్ తో పాటు ఎమ్మెల్యేలు
  • గత రాత్రి మీడియా సమావేశం సమయానికి జైపూర్ కు
  • రాజస్థాన్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ
3 Mlas from Sachin Pilot Camp Out

మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ పార్టీని వదిలేసి, సొంత పార్టీ ప్రభుత్వాన్ని కూల్చి, బీజేపీకి మద్దతు పలికి, అక్కడ కమలనాధులను కూర్చోబెట్టిన తరువాత, సరిగ్గా,మూడు నెలలకు అదే తరహా సమస్య రాజస్థాన్ లోనూ ఎదురైంది. సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి, బీజేపీ పంచన చేరబోతున్నారని, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వైఖరి నచ్చక, తన వర్గం ఎమ్మెల్యేలతో పార్టీ మారబోతున్నారని గత మూడు, నాలుగు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, తమ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, నిన్న రాత్రి జైపూర్ లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో, రెండు రోజుల క్రితం సచిన్ పైలట్ తో పాటు ఢిల్లీకి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రత్యక్షం కావడం గమనార్హం. దీంతో రాజస్థాన్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.

2018లో రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, ముఖ్యమంత్రి పీఠాన్ని సచిన్ పైలట్ కోరుకున్నా, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం అశోక్ గెహ్లాట్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఆపై కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో, పరిస్థితి మారింది. అప్పటి నుంచి సచిన్ పైలట్ ను తమవైపు తిప్పుకోవాలని ప్రణాళికలు రచించిన బీజేపీ, లాక్ డౌన్ కు ముందే అతనితో చర్చలు జరిపిందన్న వార్తలు కూడా వచ్చాయి. 

అప్పటి నుంచి రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు బీజేపీపై విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రంలో అనిశ్చితిని లేవనెత్తి, ఎమ్మెల్యేలను కొనడం ద్వారా, ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆపై విషయం సోనియా గాంధీ వరకూ వెళ్లడంతో, ఆమె పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 

ఆ పరిణామాల నేపథ్యంలోనే పైలట్ వర్గంలోని కొందరు వెనక్కు వచ్చారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇదే సమయంలో తన వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సచిన్ పైలట్ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో రాజస్థాన్ లో రాజకీయాలు ఏ క్షణం ఎటువంటి మలుపు తీసుకుంటాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

More Telugu News