బెంగళూరులో దారుణం.. యువతిపై అఘాయిత్యం.. సహకరించిన ఆమె తల్లి!

13-07-2020 Mon 08:13
  • బెంగళూరులోని కాలేజీలో చదువుతున్న యువతి
  • కుమార్తెకు టీ, ఇతర ఆహార పదార్థాల్లో మత్తుమందు కలిపి ఇస్తూ భర్తకు సహకారం
  • మోడలింగ్ చేయాలని, అశ్లీల వీడియోలు తీయాలని వేధింపులు
wife help husband to molest his own daughter

యువతిపై కన్నేసిన మారుటి తండ్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడితే, స్వయంగా ఆమె తల్లే అతడికి సహకరించిన దారుణ ఘటన బెంగళూరులోని ఉద్యాన నగరిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలి(20) తల్లి రీమా కొన్నేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న అనంతరం అలెగ్జాండర్ దాస్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. అతడు ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తుండగా, రీమా కుమార్తె (20) ఓ కాలేజీలో చదువుకుంటోంది. అరెకెరెలోని ఓ అద్దె ఇంట్లో వీరు నివసిస్తున్నారు.  

కుమార్తె వరుసైన యువతిపై తన భర్త కన్నేసిన విషయం తెలుసుకున్న రీమా అతడికి సహకరించింది. టీ, ఇతర ఆహార పదార్థాల్లో నిద్రమాత్రలు కలిపి కుమార్తెకు ఇచ్చేది. అవి తీసుకుని నిద్రమత్తులోకి జారిపోయిన అనంతరం దాస్ ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఏడాదిన్నర క్రితం ఓ పని కోసం యువతిని హైదరాబాద్ తీసుకొచ్చిన దాస్ హోటల్ గదిలో మద్యం తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి తెగబడ్డాడు.  

తనపై జరుగుతున్న లైంగిక దాడిని ప్రశ్నించిన యువతి మొబైల్ లాక్కుని కాలేజీకి వెళ్లొద్దని హుకుం జారీ చేసిన దాస్.. ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయిన బాధితురాలు తాజాగా హుళిమావు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అతడి నుంచి తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని వేడుకుంది. అంతేకాదు, తనను కాలేజీ మాన్పించిన నిందితుడు అశ్లీల వీడియోలు తీయాలని, మోడలింగ్ చేయాలని వేధించేవాడని, అతడి దారుణాలకు తన తల్లి కూడా సహకరించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.