England: ఇంగ్లండ్‌కు విండీస్ షాక్.. తొలి టెస్టులో ఘన విజయం!

  • తొలి బయో సిరీస్‌లో నాలుగు వికెట్లతో విండీస్ ఘన విజయం
  • ఒంటరి పోరుతో విజయానికి బాటలు వేసిన బ్లాక్‌వుడ్
  • ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్‌లో విండీస్‌కు తొలి విజయం
West Indies beats England in fist Bio test series

కరోనా వైరస్ విజృంభణతో దాదాపు నాలుగు నెలల తర్వాత ఇంగ్లండ్-విండీస్ మధ్య సౌతాంప్టన్‌లో జరిగిన తొలి టెస్టు ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో చివరికి విండీస్ జయకేతనం ఎగురవేసింది. చివరి రోజు 200 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకున్న కరీబియన్ జట్టు ఆ తర్వాత అద్భుత పోరాట పటిమతో ఆకట్టుకుని మూడు టెస్టుల సిరీస్‌లో బోణీ చేసింది.  

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 204 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ కాగా, ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 318 పరుగులు చేసి 114 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు 313 పరుగులకు ఆలౌట్ అయింది. డి సిబ్లీ (50), జాక్ క్రాలీ (76) అర్ధ సెంచరీలతో రాణించగా, ఓపెనర్ రోరీ బర్న్స్ 42, కెప్టెన్ స్టోక్స్ 46 పరుగులతో పరవాలేదనిపించారు.

200 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఏడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా, 27 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. వికెట్లు కూలుతుండడంతో విండీస్ ఒత్తిడిలో పడగా, ఇంగ్లండ్‌లో జోష్ కనిపించింది. అయితే, జెర్మెయిన్ బ్లాక్‌వుడ్ ఒంటరి పోరాటంతో ఇంగ్లండ్ ఆశలు నీరుగారాయి. ఇంగ్లండ్ బౌలర్లను సమయోచితంగా ఎదుర్కొంటూ జట్టును విజయం దిశగా నడిపించాడు. 95 పరుగులు చేసి విజయానికి బాటలు వేసిన బ్లాక్‌వుడ్.. స్టోక్స్ బౌలింగ్‌లో సెంచరీ ముందు ఔటయ్యాడు.

క్రీజులో ఉన్నంత సేపూ అతడికి రోస్టన్ చేజ్ (37) సహకరించాడు. దీంతో 64.2 ఓవర్లలోనే 200 పరుగులు చేసిన విండీస్ తొలి బయో సిరీస్‌లో 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో విండీస్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ గెలుపుతో విండీస్ ఖాతాలో 40 పాయింట్లు చేరాయి. కాగా, ఇంగ్లండ్ గడ్డపై విండీస్ ఓ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం 2000 సంవత్సరం తర్వాత ఇది రెండోసారి మాత్రమే. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 9 వికెట్లు పడగొట్టి విండీస్ విజయానికి బాటలు వేసిన షానాన్ గాబ్రియెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

More Telugu News