ఎన్‌కౌంటర్ భయంతో వణికిపోతున్న యూపీ ఎస్సై.. రక్షణ కల్పించాలంటూ సుప్రీంను ఆశ్రయించిన వైనం!

13-07-2020 Mon 06:44
  • నన్ను ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉంది
  • నాకు, నా భార్యకు రక్షణ కల్పించండి
  • కావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించండి: కేకేశర్మ
SI accused of tipping of vikas dubey moves SC

పోలీసుల దాడి గురించి గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబేకు ముందే సమాచారం అందించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన బిక్రూ ఎస్సై కేకే శర్మను ఎన్‌కౌంటర్ భయం వెంటాడుతోంది. దూబే, అతడి అనుచరులలా తనను కూడా ఎన్‌కౌంటర్ చేస్తారన్న భయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు, తన భార్య వినితా సిరోహినికి రక్షణ కల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. తనను ఎన్‌కౌంటర్ చేస్తారని భయంగా ఉందని, తనపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కానీ, సీబీఐతో కానీ విచారణ జరిపిస్తే నిజాలు నిగ్గుతేలుతాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు.

పోలీసులు దాడి చేయబోతున్నారంటూ వికాశ్ దూబేకు ముందే ఉప్పందించిన పోలీసుల్లో బిక్రూ పోలీస్ స్టేషన్‌కు చెందిన కేకే శర్మతోపాటు చౌబేపూర్ స్టేషన్ హౌస్ ఇన్‌చార్జ్ వినయ్ తివారీ కూడా స్పెషల్ టాస్క్‌ ఫోర్స్ (ఎస్టీఎఫ్) అదుపులో ఉన్నారు.