ఢిల్లీలో కేసులు తగ్గుతుంటే తెలంగాణలో పెరగడం ఆందోళనకరం: కిషన్ రెడ్డి

12-07-2020 Sun 20:37
  • గాంధీ ఆసుపత్రి, కరోనా పరీక్ష కేంద్రాలను సందర్శించిన కిషన్ రెడ్డి
  • రాష్ట్రంలో మరణాల రేటు ఎక్కువగా ఉందని వ్యాఖ్యలు
  • టెస్టుల సంఖ్యను మరింత పెంచాలని సూచన
Kishan Reddy concerned over corona cases raise in Telangana

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి, కొవిడ్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రత తగ్గుతున్న తరుణంలో తెలంగాణలో విపరీతంగా కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. తెలంగాణలో మరణాల శాతం కూడా ఎక్కువగానే ఉందని తెలిపారు.

తెలంగాణలో టెస్టులు సంఖ్యను మరింత పెంచాలని, చికిత్సను వేగవంతం చేయాలని సూచించారు. గాంధీ ఆసుపత్రిలో చేరేందుకు రోగులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో తెలంగాణ ప్రభుత్వం ఓసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాలకు సాయపడేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కరోనా చికిత్స కోసం ఇప్పటికే తెలంగాణకు కేంద్రం నుంచి రూ.215 కోట్లు వచ్చాయని వెల్లడించారు.