కరోనా బారిన పడిన యూపీ మంత్రి, అలనాటి క్రికెటర్ చేతన్ చౌహాన్

12-07-2020 Sun 14:28
  • చేతన్ చౌహాన్ కు కరోనా పాజిటివ్
  • లక్నో సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స
  • కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్
India former cricketer and Uttar Pradesh minister Chetan Chauhan tested corona positive

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి గత కొన్నివారాలుగా ఉద్ధృతంగా కొనసాగుతోంది. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో, అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తోంది. తాజాగా యూపీ మంత్రి,  భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. చేతన్ చౌహాన్ శుక్రవారం కరోనా పరీక్షలు చేయించుకోగా, టెస్టు రిపోర్టు నిన్న వచ్చింది. ఈ నేపథ్యంలో, లక్నోలోని ఆయన కుటుంబ సభ్యులకు కూడా అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. చేతన్ చౌహాన్ కు లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. లక్షణాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్ విధించారు.

గవాస్కర్ తరం ఆటగాడైన చేతన్ చౌహాన్ అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ కు విశేషమైన సేవలు అందించారు. 40 టెస్టులు ఆడి 2 వేలకు పైగా పరుగులు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించి తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ లో యువజన, క్రీడల మంత్రిగా వ్యవహరిస్తున్నారు.