గ్రామస్తుల నుంచి తప్పించుకోబోయిన దొంగ... మింగేసిన పొలం బావి

12-07-2020 Sun 13:33
  • జనగాం జిల్లా రాఘవాపూర్ లో ఘటన
  • డబుల్ బెడ్ రూం ఇళ్లలో చోరీకి వచ్చిన ముగ్గురు వ్యక్తులు
  • ఇద్దర్ని బంధించిన గ్రామస్తులు
Thief dies while escaping from villagers

చోరీకి వచ్చిన దొంగ పారిపోయే క్రమంలో బావిలో పడి ప్రాణాలు వదిలిన ఘటన జనగామ జిల్లా రాఘవాపూర్ సమీపంలో జరిగింది. ముగ్గురు వ్యక్తులు రాఘవాపూర్ గ్రామంలోని డబుల్ బెడ్ రూం ఇళ్లలో సెట్ టాప్ బాక్సుల దొంగతనానికి వచ్చారు.

గ్రామంలో కొత్త ముఖాలు కనిపిస్తుండడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారు దొంగలని గ్రహించి ఇద్దరిని పట్టుకున్నారు. మూడో యువకుడు పారిపోతుండగా, హైవే పక్కనే ఉన్న పొలం బావిలో పడి దుర్మరణం పాలయ్యాడు. చనిపోయిన యువకుడ్ని హైదరాబాద్ కు చెందని ఉమర్ గా భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.