అడవిపక్కన తల్లిని వదిలేసిన కుమారులు.. మూడు రోజులు వర్షంలో తడిచిన తల్లి

12-07-2020 Sun 12:52
  • చిత్తూరు జిల్లా పెంగరగుంటలో ఘటన 
  • ఓ ఆలయం వద్ద కూర్చున్న 90 ఏళ్ల వృద్ధురాలు
  • సాయం చేసిన స్థానికులు
  • ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌కు తరలింపు
mother was left in a forest by her children as they suspected she was a coronavirus patient

కన్న తల్లిని అడవిపక్కన వదిలేసి వెళ్లి పోయారు ఆమె కుమారులు. దీంతో ఆమె మూడు రోజులపాటు వర్షంలో తడుస్తూ అక్కడే కూర్చుంది. చిత్తూరు జిల్లా పెంగరగుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. 90 ఏళ్ల వృద్ధురాలు కుంటిగంగమ్మ ఆలయం వద్ద  అటవీ ప్రాంత సమీపంలో ధీనంగా కూర్చుని ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆమెకు సాయం చేశారు. గ్రామ వలంటీర్లు అక్కడికి చేరుకుని ఆమెకు భోజనం పెట్టారు.

ఆమె మూడు రోజులుగా నీరసించిపోవడంతో కనీసం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. ఆమెకు కరోనా సోకిందని అనుమానించి సరిహద్దుల్లోని తమిళనాడు గ్రామం నుంచి ఆమెను ఆమె కుమారులే ఇక్కడ వదిలేశారన్న అనుమానులు వ్యక్తమవుతున్నాయి. పలమనేరు తహసీల్దార్‌ శ్రీనివాసులు ఆ వృద్ధురాలిని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌కు తరలించారు. అక్కడ ఆమెకు భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు.