రెమిడీసివిర్ వాడే విషయంలో జాగ్రత్త: ఐసీఎంఆర్ హెచ్చరిక!

12-07-2020 Sun 09:54
  • ఆక్సిజన్ సపోర్ట్ తో ఉంటేనే వాడండి
  • అతిగా వాడితే లివర్, కిడ్నీ వైఫల్యాలు
  • మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందన్న ఐసీఎంఆర్
ICMR Says Caution on Remidesivir Usage

కరోనా వ్యాధి బారిన పడిన వారికి చికిత్స విషయంలో రెమిడీసివిర్ ను వాడే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీఎంఆర్ హెచ్చరించింది. కేవలం ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్న వారికి మాత్రమే ఈ డ్రగ్ ను ఇవ్వాలని సూచించింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఇండియాలో లక్షకు పైగా కొత్త కేసులు వచ్చాయని గుర్తు చేసిన ఐసీఎంఆర్, రెమిడీసివిర్ ను రోగులకు ఇవ్వడం వల్ల లివర్, కిడ్నీ వైఫల్యాలు తలెత్తవచ్చని పేర్కొంది. ఎంతో ఎమర్జెన్సీ అయితేనే రెమిడీసివిర్, టోసిలిజుమాబ్ ఔషధాలను వినియోగించాలని, వీటిని అతిగా వాడటం వల్ల మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు అధికమని హెచ్చరించింది.

కాగా, కరోనా నుంచి త్వరగా బయటపడేందుకు రెమిడీసివిర్ సహకరిస్తుందని తేలినప్పటికీ, ఈ డ్రగ్ అందుబాటులోకి వచ్చిన తరువాత మరణాల రేటు మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ఇండియాలో గత 24 గంటల వ్యవధిలో 27,114 కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 8.20 లక్షలను దాటింది. తాజాగా మరో 519 మంది మరణించడంతో మృతుల సంఖ్య 22,123కు చేరింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్లినికల్ మేనేజ్ మెంట్ పై ప్రత్యేక దృష్టిని సారించామని వెల్లడించిన ఐసీఎంఆర్, రోగులకు ఆక్సిజన్ థెరపీని కొనసాగించాలని, వ్యాధి బాధితులకు స్టెరాయిడ్స్ కొనసాగించాలని సూచించింది.