యాపిల్ కు విడిభాగాలు సరఫరా చేసే ఫాక్స్ కాన్ కన్ను... ఇప్పుడు ఇండియాపై!

12-07-2020 Sun 07:54
  • తమిళనాడులో సుమారు రూ. 7600 కోట్ల పెట్టుబడి
  • శ్రీపెరంబుదూరులో ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు
  • ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
Foxconn Looks India for A Plant

ఫాక్స్ కాన్... ఈ పేరు అత్యధికులకు తెలియకపోవచ్చు. అయితే, యాపిల్ పేరు తెలియని వారుండరు. యాపిల్ స్మార్ట్ ఫోన్లకు అవసరమైన విడిభాగాలను సరఫరా చేసేది ఈ సంస్థే. ఇప్పుడు ఫాక్స్ కాన్ కన్ను ఇండియాపై పడింది. ఏకంగా సుమారు రూ. 7,600 కోట్లు (బిలియన్ డాలర్లు) ఇండియాలో పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.

తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ఈ తైవాన్ సంస్థ నిర్ణయించుకుందని తెలుస్తోంది. యాపిల్ సంస్థ చైనాను వీడాలని నిర్ణయించుకుని, దశలవారీగా ప్లాన్లు రూపొందిస్తున్న వేళ, ఫాక్స్ కాన్ ప్రణాళికలు బయటకు రావడం గమనార్హం. 

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి చైనా, అమెరికాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యాపిల్ పై సైతం ఒత్తిడి పెరిగింది. చైనా ఉత్పత్తులను పలు దేశాలు నిషేధిస్తుండగా, అమెరికా కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు చైనా ఉత్పత్తులపై నిషేధాన్ని విధించింది కూడా. ఇదే సమయంలో యాపిల్ సంస్థ నుంచి తమకు విడి భాగాలు అందించే క్లయింట్లపై కూడా ఒత్తిడి పెరిగింది. దీంతోనే ఫాక్స్ కాన్ తన విడిభాగాల తయారీని ఇండియాకు తరలించాలని యోచిస్తున్నట్టు సమాచారం. 

ఇదే సమయంలో ఫాక్స్ కాన్ తమిళనాడును ఎంచుకోవడానికి ఓ కారణం కూడా ఉంది. చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని శ్రీపెరంబుదూరులో యాపిల్ ఐ ఫోన్ ఎక్స్ ఆర్ తయారీ ప్లాంటు ఉందన్న సంగతి తెలిసిందే. ఇక్కడే తమ ప్లాంటును కూడా ఏర్పాటు చేస్తే, విడిభాగాల సరఫరాకు ఇబ్బందులు ఉండవన్నది ఫాక్స్ కాన్ ఆలోచన. ఈ విషయంలో అటు యాపిల్ నుంచిగానీ, ఇటు ఫాక్స్ కాన్ నుంచి గానీ అధికారిక సమాచారం వెలువడలేదు.