అమితాబ్ కు కరోనా ఎలా సోకిందంటే..!

12-07-2020 Sun 07:15
  • సినీ ఇండస్ట్రీకి షాక్
  • లాక్ డౌన్ తొలి రోజు నుంచి ఇంటికే పరిమితమైన బిగ్ బీ
  • ఇటీవలే కేబీసీ ప్రమోషనల్ ఈవెంట్ కు హాజరు
How Corona Reached Amitab

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకిందని తెలియడంతో మొత్తం చిత్ర పరిశ్రమ షాక్ నకు గురైంది. మార్చి 23న లాక్ డౌన్ ప్రారంభించిన రోజు నుంచి ఆయన ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు వీడియోలు రూపొందించారు. ఇంట్లోనే ఉంటూ చిరంజీవి, మమ్ముట్టి, రజనీకాంత్ తదితరులతో కలిసి ఓ లఘు చిత్రంలో కూడా నటించారు. అటువంటి ఆయన్ను కరోనా వైరస్ ఎలా చేరింది?

వాస్తవానికి లాక్ డౌన్ సడలింపులు ప్రారంభమైన తరువాత, అమితాబ్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. తాను హోస్ట్ గా వ్యవహరించాల్సిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' సెలక్షన్స్, ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి తరువాత అమితాబ్ పాల్గొన్న కార్యక్రమం ఇదొక్కటే. అక్కడికి వచ్చిన వారిలో ఎవరిలోనో వైరస్ ఉండి వుండవచ్చని, వారి నుంచే అమితాబ్ కు సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు? వారిలో ఎవరికి వైరస్ ఉందన్న విషయమై అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.