Vizag: ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేస్తే ఇంతే... విశాఖలో కిడ్నాప్ వెనుక అసలు కథ!

  • పలువురి నుంచి డబ్బు తీసుకున్న అగస్త్యన్
  • తమ డబ్బు తిరిగి ఇవ్వాలంటూ నిరుద్యోగుల కిడ్నాప్
  • కేసును లోతుగా విచారిస్తున్న పోలీసులు
Man Cheated Unemployed Youth in Vizag Kidnaped

తమకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దారుణంగా మోసం చేసిన ఓ వ్యక్తిని, కొందరు నిరుద్యోగులు బలవంతంగా కిడ్నాప్ చేసిన ఘటన విశాఖపట్నం పరిధిలోని గాజువాకలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, అగస్త్యన్ అనే వ్యక్తి, పలువురు నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల పేరిట లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. ఆపై ఎన్నటికీ తమకు ఉద్యోగాలు ఇప్పించక పోవడంతో, అతన్ని నమ్మిన నిరుద్యోగులంతా నిలదీశారు. 

తమ డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ, అతన్ని బంధించి, కారులో ఎక్కించి తీసుకుని బయలుదేరారు. ఈ క్రమంలో తనను కిడ్నాప్ చేసి తీసుకుని వెళుతున్నారంటూ అగస్త్యన్ నుంచి పోలీసులకు సమాచారం వెళ్లగా, విశాఖ డెయిరీ వద్ద కారును ఆపి, అందరినీ స్టేషన్ కు తీసుకుని వెళ్లి విచారణ ప్రారంభించగా, విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

కాకినాడలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి మొత్తం రూ. 50 లక్షలకు పైగానే అగస్త్యన్ వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. గతంలో ఓ మోసం కేసులో అగస్త్యన్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడని గుర్తించిన పోలీసులు, ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు వెల్లడించారు.

More Telugu News