South States: వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్న దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు!

  • పాల్గొన్న సవాంగ్, మహేందర్ రెడ్డి, లోకనాథ్ బెహ్రా
  • కరోనా, ఉగ్రవాద నిర్మూలనపై చర్చ
  • పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయం
South States DGPs Meeting

కరోనా వ్యాప్తి, ఉగ్రవాద నిర్మూలన, రాష్ట్రాల మధ్య నమన్వయం తదితర అంశాలపై ఐదు దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు కీలక సమావేశం నిర్వహించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, కేరళ డీజీపీ లోకనాథ్ బెహ్రా, తమిళనాడు డీజీపీ జేకే త్రిపాఠి, కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూధ్ లతో పాటు ఆయా రాష్ట్రాల ప్రధాన పోలీసు విభాగాలకు చెందిన  అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తీర ప్రాంతంలో గస్తీ పెంచడం, మనుషుల అక్రమ రవాణా, డ్రగ్స్ తదితర అంశాలపైనా వీరి సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, అనంతపురం జిల్లాల నుంచి చెన్నై కేంద్రంగా మనుషుల అక్రమ రవాణా జరుగుతోందని వ్యాఖ్యానించిన గౌతమ్ సవాంగ్, దీన్ని అరికట్టేందుకు సహకరించాలని కోరారు.

ఇటీవల ఏపీలో ఏర్పాటైన ప్రత్యేక ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో గురించి వివరించిన ఆయన, ఈ బృందం సహకారంతో ఏడు వారాల వ్యవధిలోనే 20 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతో  నేరాలను మరింతగా అరికట్టవచ్చని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో నేరాలను అదుపు చేసేందుకు రాష్ట్రాల మధ్య సహకారం ఉండాలని, ఇందుకోసం తరచూ సమావేశాలు నిర్వహించాలని డీజీపీలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News