Air India: జాబ్ ఆఫర్లను విత్ డ్రా చేసుకున్న ఎయిర్ ఇండియా!

  • 180 మంది ట్రయినీలకు శిక్షణ
  • శిక్షణ పూర్తి చేసుకున్న వారికి గతంలోనే ఉద్యోగ ఆఫర్ లెటర్లు
  • ఇప్పుడు కరోనా కారణంగా వెనక్కు తీసుకున్న సంస్థ
Air India Withdraws Job Offers for Trainees

కరోనా మహమ్మారి విస్తరణ, లాక్ డౌన్ నేపథ్యంలో పౌర విమానయాన రంగం కుదేలుకాగా, ఎయిర్ ఇండియా సైతం తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో 180 మంది ట్రయినీలకు ఇచ్చిన జాబ్ ఆఫర్లను ఎయిర్ ఇండియా తిరస్కరించింది. క్యాబిన్ క్రూలుగా వీరికి ఇచ్చిన ఉద్యోగ ఆఫర్లను వెనక్కి తీసుకుంటున్నట్టు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

"180 మంది ట్రయినీలకు ఇచ్చిన జాబ్ ఆఫర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. వీరంతా విమానయానరంగంలో శిక్షణ తీసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ పరిస్థితులే ఇందుకు కారణం. ప్రస్తుత పరిస్థితులు మన నియంత్రణలో లేవు. దీంతో మీ తదుపరి శిక్షణను కూడా నిలిపివేస్తున్నాం.  ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయి" అని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

శిక్షణ తీసుకుంటున్న వారు గతంలో సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను తిరిగి ఇచ్చేస్తున్నామని తెలిపిన ఎయిర్ ఇండియా, ఇవన్నీ సంస్థ అంతర్గత సమస్యలని, దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించలేమని పేర్కొంది. కాగా, మార్చి మూడో వారం నుంచి విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతిన్నదన్న సంగతి తెలిసిందే. మే 25 తరువాత దేశవాళీ విమానాలకు అనుమతించినా, వైరస్, లాక్ డౌన్ నిబంధనల అమలు కారణంగా పూర్తి స్థాయి సర్వీసులను ఏ విమానయాన సంస్థా నడిపించడం లేదన్న సంగతి తెలిసిందే.

అన్ని విమానయాన సంస్థలకూ, వైరస్ రాకముందు నడుపుతున్న సర్వీసుల్లో 45 శాతం నడిపించేందుకు అనుమతి ఉంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం, పలు రూట్లలో విమానాలు నడుస్తూ ఉన్నా, ప్రయాణికులు మాత్రం గతంలో ఉన్న స్థాయిలో లేరు. విమానాల్లో గరిష్ఠంగా 60 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదవుతూ ఉంది.

More Telugu News