14 నుంచి బెంగళూరులో పూర్తి లాక్ డౌన్ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం!

11-07-2020 Sat 21:06
  • బెంగళూరులో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు
  • ఈ నెల 14 నుంచి 23 వరకు పూర్తి లాక్ డౌన్
  • అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి
Full lockdown in Bengaluru from July 14 to 23

కర్ణాటకలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో ప్రతి రోజు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. మహమ్మారి కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 14వ తేదీ నుంచి 23 వరకు బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. 14వ తేదీ రాత్రి 8 గంటలకు లాక్ డౌన్ మొదలవుతుందని... 23వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, లాక్ డౌన్ రోజుల్లో అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని హెచ్చరించింది.