నియంత్రిత పద్ధతిలో రైతులు సాగు చేస్తుండటం శుభసూచకం: కేసీఆర్

11-07-2020 Sat 20:48
  • రైతుబంధు సాయం ప్రతి రైతుకు అందాలి
  • రైతు వేదికలను దసరా నాటికి పూర్తి చేయాలి
  • రూ. 25 కోట్లతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజి నిర్మిస్తాం
Raithu Bandhu has to reach every farmer says KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు, వ్యవసాయ రంగంపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాదు, ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్ష సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికలను దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రైతుబంధు సాయం అందని రైతులు ఎవరూ ఉండకూడదని.. సాయం అందని రైతులు ఎవరున్నా గుర్తించాలని... చిట్ట చివరి రైతు వరకు రైతుబంధు అందాలని అన్నారు.

ప్రభుత్వం సూచించిన నియంత్రిత పద్ధతిలోనే వందకు వంద శాతం రైతులు ఈ వానాకాలం పంటను సాగు చేస్తున్నారని ఆయన కితాబునిచ్చారు. ఇది శుభసూచకమని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయానికి ఇది ప్రారంభమని అన్నారు. సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కింద ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ. 25 కోట్లతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజి నిర్మించనున్నట్టు చెప్పారు.