నాగ్ విసిరిన చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన సమంత

11-07-2020 Sat 20:05
  • మామతో కలిసి మొక్కలు నాటిన సమంత
  • టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కు ధన్యవాదాలంటూ పోస్టు
  • కీర్తి సురేశ్, రష్మిక, శిల్పారెడ్డిలను నామినేట్ చేసిన సమంత
Samantha takes up Green India Challenge

తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. సెలబ్రిటీలు తమ వంతుగా మొక్కలు నాటుతూ ఈ పర్యావరణ హిత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున విసిరిన ఈ చాలెంజ్ ను ఆయన కోడలు సమంత స్వీకరించారు. తన మామ నాగార్జున విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన తాను 3 మొక్కలు నాటానని సమంత ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నాగ్ తో కలిసి మొక్కలు నాటుతున్న ఫొటోలు కూడా పంచుకున్నారు.

అంతేకాదు, ఈ చాలెంజ్ లో భాగంగా మరో ముగ్గుర్ని నామినేట్ చేస్తూ కీర్తి సురేశ్, రష్మిక మందన్న, శిల్పా రెడ్డి (ఫ్యాషన్ డిజైనర్)లకు చాలెంజ్ విసిరారు. ఇంతటి బృహత్తర పథకాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అక్కినేని కుటుంబ సభ్యుల స్పందన పట్ల ఎంపీ సంతోష్ హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో మెరుగైన జీవన ప్రమాణాలను నెలకొల్పేందుకు మీ వంతు సహకారం అందిస్తున్నారంటూ కొనియాడారు.