ఇటీవల హత్యకు గురైన చిన్నారి ఆద్య... రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య

11-07-2020 Sat 15:24
  • చేయని నేరానికి బలైన చిన్నారి ఆద్య
  • కుమార్తె మరణంతో మనస్తాపానికి గురైన తండ్రి!
  • ఇద్దరు ప్రియులతో వివాహిత అక్రమ సంబంధాలు
Man commits suicide after daughter murder

ఇటీవల మేడ్చల్ జిల్లా పోచారంలో ఆద్య అనే చిన్నారి చేయని నేరానికి బలైన సంగతి తెలిసిందే. ఆద్య తల్లి ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం ఏర్పరచుకోగా, వారిలో ఓ యువకుడు ఆద్యను గొంతుకోసి చంపాడు. ఈ ఘటన జరిగి కొన్ని వారాలు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆద్య తండ్రి కల్యాణ్ ఆత్మహత్య చేసుకోవడం మరోసారి కలకలం రేపింది. భువనగిరి వద్ద రైలు కిందపడి తనువు చాలించాడు. కుమార్తె మరణంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.

కల్యాణ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం)లో పంచాయతీ కార్యదర్శిగా ప్రభుత్వోద్యోగం చేస్తున్నాడు. సదరు వివాహిత, కల్యాణ్ ప్రేమవివాహం చేసుకున్నారు. వీరి కాపురంలో ఫేస్ బుక్ స్నేహాలు చిచ్చు రేపాయి. సికింద్రాబాద్ కు చెందిన ఓ యువకుడితో వివాహిత అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. అంతేకాదు, ఆ యువకుడు పరిచయం చేసిన మరో యువకుడితోనూ ఇదే తరహా సంబంధం పెట్టుకుంది. దాంతో మొదటి యువకుడు ఆగ్రహంతో రగిలిపోయి ఆమె కుమార్తెను బలిగొన్నాడు.