మీ నాన్న వల్ల మహేశ్ బాబుతో 'పోకిరి'ని కోల్పోయాను: కంగన ఫైర్

11-07-2020 Sat 12:41
  • సుశాంత్ మరణం తర్వాత నెపోటిజంపై మండిపడుతున్న కంగన
  • భట్ ఫ్యామిలీపై కూడా తీవ్ర విమర్శలు
  • తనను విమర్శించిన పూజా భట్ కు కౌంటర్ ఇచ్చిన కంగన
I lost Mahesh Babu film due to your father says Kangana

బాలీవుడ్ లో కంగనా రనౌత్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె... స్వయంకృషితో అగ్ర నటిగా ఎదిగింది. దర్శకురాలిగా, నిర్మాతగా కూడా సత్తా చాటుతోంది. మరోవైపు, బాలీవుడ్ లో పురుషాధిక్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న మహిళ ఆమె. హృతిక్ రోషన్ వంటి సూపర్ స్టార్లు, కరణ్ జొహార్ వంటి స్టార్ దర్శకనిర్మాతలు కూడా ఈమె బారిన పడినవారే.

హీరో సుశాంత్ ఆత్మహత్య తర్వాత కంగన మరోసారి బాలీవుడ్ ప్రముఖులపై మండిపడుతోంది. నెపోటిజంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. దీంతో తన మొదటి సినిమా 'గ్యాంగ్ స్టర్' నిర్మాత మహేశ్ భట్ పై కంగన తీవ్ర విమర్శలు చేసింది. తన తండ్రిపై విమర్శలు చేయడంతో పూజా భట్ కూడా ఈమెపై ఫైర్ అయింది.

'గ్యాంగ్ స్టర్' చిత్రానికి గాను 2006లో ఉత్తమ నూతన నటిగా ఆమె అవార్డు అందుకుంది. ఆ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకడైన ముఖేశ్ భట్ తమ్ముడు మహేశ్ భట్ ను కంగన కౌగిలించుకుంది. అనంతరం అవార్డు తీసుకున్న తర్వాత చిత్ర యూనిట్ ను ప్రశంసించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని... అప్పుడు ప్రశంసించిన కంగన ఇప్పుడు విమర్శిస్తోందని ఆమెపై పూజాభట్ మండిపడింది.

దీనిపై కంగన స్పందిస్తూ తనపై మహేశ్ భట్ కుమార్తె పూజాభట్ చేసిన విమర్శలకు బదులుగా ఓ వీడియో ద్వారా సమాధానం చెప్పింది. 'మీ నాన్న వల్ల నాకు పెద్ద నష్టమే జరిగింది. మీ 'గ్యాంగ్ స్టర్' సినిమా సమయంలోనే నేను తెలుగులో మహేశ్ బాబు సినిమా 'పోకిరి'ని వదులుకోవాల్సి వచ్చింది. దీని వల్ల నాకు పెద్ద నష్టమే జరిగింది' అని చెప్పింది.