హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు.. ఫ్లైఓవర్‌ పనులకు శంకుస్థాపన

11-07-2020 Sat 12:04
  • ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్టీ వరకు తొలి దశ పనులు ప్రారంభం
  • రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు రెండో దశ
  • స్టీల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం
  • మొత్తం రూ.426 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్
KTR Lay Foundation For Steel Bridges At Indira Park

హైదరాబాద్‌లో ఉండే ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలను తగ్గించేందుకు కృషి చేస్తోన్న తెలంగాణ సర్కారు ఇప్పటికే పలు కూడళ్లలో బ్రిడ్జిలు నిర్మించింది. ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్టీ వరకు, రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు  స్టీల్ బ్రిడ్జి నిర్మించాలని సంకల్పించింది. మొత్తం రూ.426 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించనుంది.

ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్టీ వరకు మొదటి దశలో రూ.350 కోట్లతో 4 లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ స్టీల్‌బ్రిడ్జి  నిర్మించనున్నారు. అనంతరం రెండో దశలో రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు 3 లేన్ల వంతెన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. రూ.76 కోట్లతో 3 లేన్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం ఉంటుంది.

మొదటి దశ పనులకు సంబంధించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఇందులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, హైదరాబాద్‌ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ క్రాస్ రోడ్ ట్రాఫిక్ సమస్య చాలా కాలం నుంచి ఉందని చెప్పారు. ఫ్లై ఓవర్‌తో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు.