Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. కరోనా బాధితుల ఇంటికే ‘ఐసోలేషన్ కిట్’

  • రాష్ట్రంలో పెరుగుతున్న హోం ఐసోలేషన్ బాధితుల సంఖ్య
  • 17 రోజులపాటు ఇంట్లోనే ఉంచి చికిత్స చేసుకునేలా అవసరమైన వస్తువులు
  • ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ సరఫరా
Telangana govt decided to supply home isolation kit for corona victims

తెలంగాణలో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి అవసరమైన ఔషధాలు, మాస్కులు, శానిటైజర్లను ‘ఐసోలేషన్ కిట్’ పేరుతో ఉచితంగా వారింటికే సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

రాష్ట్రంలో ఇటీవల కేసులు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందికిపైగా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నప్పటికీ ఎలాంటి మందులు వేసుకోవాలి? వాటిని ఎలా వాడాలి? ఎవరిని సంప్రదించాలనే విషయంలో అయోమయం నెలకొనడంతో బాధితులు మరింతగా భయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో వారి అవస్థలను దృష్టిలో పెట్టుకుని వారికి అవసరమైన అన్నింటినీ నేరుగా వారి ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 17 రోజులపాటు ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టకుండా ఉండేలా అవసరమైన వస్తువులు, ఔషధాలను కిట్‌లో ఉంచి సరఫరా చేయనుంది. బాధితుడు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న విషయాన్ని వైద్యాధికారులు నిర్ధారించుకున్న వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రి నుంచి కిట్‌ను తీసుకెళ్లి అందిస్తారు. ఇంట్లో ఎంతమంది బాధితులు ఉంటే అందరికీ వాటిని అందిస్తారు.

ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే హోం ఐసోలేషన్ కిట్‌లో శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు, పారాసెటమాల్, యాంటీ బయాటిక్స్, విటమిన్ సి, ఈ, డీ3 ట్యాబ్లెట్లు, లివోసెట్రిజన్, ఎసిడిటీని తగ్గించే మాత్రలతో పాటు వాటిని ఎలా వాడాలో తెలిపే పుస్తకం కూడా ఉంటుంది.

More Telugu News