ప్రేమించిన అమ్మాయి.. పెద్దలు చూసిన అమ్మాయి.. ఇద్దరికీ ఒకేసారి తాళికట్టిన యువకుడు!

11-07-2020 Sat 07:42
  • మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఘటన
  • యువకుడితోనే కలిసి జీవిస్తామన్న ఇద్దరు యువతులు
  • గ్రామ పెద్దల సమక్షంలో వివాహం
Madhyapradesh man married two women same time

ప్రేమించిన అమ్మాయి, పెద్దలు చూసిన అమ్మాయి.. ఇద్దరికీ ఒకేసారి తాళికట్టి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడో యువకుడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. ఆ వివరాలలోకి వెళితే, బేతుల్ జిల్లాలోని కెరియా గ్రామానికి చెందిన సందీప్ చదువుకుంటున్న సమయంలో ఓ యువతి ప్రేమలో పడ్డాడు. వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండగానే, ఈ విషయం తెలియని సందీప్ తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేసేందుకు మరో యువతితో సంబంధం కుదుర్చుకున్నారు.

విషయం ప్రేమికురాలికి తెలియడంతో వ్యవహారం గ్రామంలోని రచ్చబండకు చేరింది. సమస్య పరిష్కారం కోసం పెద్దలు మూడు కుటుంబాలను పిలిపించి మాట్లాడారు. అయితే, ఇక్కడే మరో ట్విస్టు చోటుచేసుకుంది. తామిద్దరం అతడితోనే కలిసి జీవిస్తామని ఇద్దరు యువతులు తేల్చిచెప్పడంతో పెద్దలు కూడా ఎదురుచెప్పలేకపోయారు. ఇద్దరినీ పెళ్లాడేందుకు సందీప్ కూడా ఓకే చెప్పడంతో ఈ నెల 8న కెరియాలో బంధుమిత్రుల మధ్య వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి విషయంలో యువతులు, వారి కుటుంబాలకు ఎటువంటి అభ్యంతరం లేకపోవడం వల్లే ఈ వివాహానికి అంగీకరించినట్టు సాక్షిగా వ్యవహరించిన గ్రామ పెద్ద మిశ్రాలాల్ తెలిపారు.