నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో నలుగురి మృతి.. బంధువుల ఆందోళన.. ఉద్రిక్తత

11-07-2020 Sat 07:15
  • మృతుల్లో ముగ్గురు కరోనా రోగులు
  • మూడు గంటలపాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందన్న బంధువులు
  • అలాంటిదేమీ లేదన్న కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్
3 corona patients died in Nizamabad hospital

నిజామాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు కరోనా రోగులు, అనారోగ్యంతో మరో వ్యక్తి మృతి చెందడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో ఆక్సిజన్ సరఫరా అందకపోవడం వల్లే కరోనా రోగులు ముగ్గురూ మృతి చెందారని వారి బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కరోనా రోగులు.. ఎడపల్లికి చెందిన మహిళ (65), జక్రాన్‌ప్లలికి చెందిన మహిళ (75), భీంగల్‌కు చెందిన వ్యక్తి (55) గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చనిపోయారు. పక్షవాతంతో ఆసుపత్రిలో నందిపేట వ్యక్తి కూడా అదే సమయంలో ప్రాణాలొదిలాడు. గంటల వ్యవధిలోనే నలుగురు మృతి చెందడంతో ఆసుపత్రిలో కలకలం రేగింది.

ఆక్సిజన్ అందకపోవడం వల్లే తమవారు చనిపోయారంటూ కరోనా రోగుల బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలోనే ఐసీయూలో సాంకేతిక సమస్య కారణంగా ఆక్సిజన్ సరఫరా శాతం తగ్గిపోయిందని, పునరుద్ధరించేందుకు మూడు గంటలు పట్టడంతోనే వారు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఆక్సిజన్ సరఫరాలో లోపం కారణంగానే రోగులు మరణించారన్న బాధిత బంధువుల ఆరోపణలను కలెక్టర్ నారాయణరెడ్డి ఖండించారు. వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కరోనా రోగులు ముగ్గురికీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని, వాటి కారణంగా పరిస్థితి విషమించి చనిపోయారని ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు పేర్కొన్నారు.