జూలై 15న ఏపీ క్యాబినెట్ భేటీ

10-07-2020 Fri 21:19
  • ఆదేశాలు జారీ చేసిన సీఎస్ నీలం సాహ్ని 
  • కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించే అవకాశం
  • ఇళ్ల పట్టాల పంపిణీపైనా చర్చించనున్న క్యాబినెట్
AP Cabinet set to held meeting on July Fifteenth
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించడంతో పాటు ప్రభుత్వ పథకాలపై నిర్ణయాలు తీసుకోవడంపై చర్చించేందుకు ఏపీ క్యాబినెట్ జూలై 15న సమావేశం కానుంది. వెలగపూడిలోని ఏపీ సచివాలయం ఫస్ట్ ఫ్లోర్ లోని సమావేశ మందిరంలో క్యాబినెట్ భేటీ జరగనుంది.

అన్ని మంత్రిత్వ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశంలో చర్చించే అంశాల ప్రతిపాదనలకు సంబంధించి 40 కాపీలను 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పంపాలని సీఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. కాగా, ఈసారి క్యాబినెట్ భేటీలో మూడు రాజధానులు, కరోనా పరిస్థితులు, ఇళ్ల పట్టాల పంపిణీ అంశాలు చర్చించనున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం కూడా ముఖ్యంగా చర్చకు రానుంది.