అంతకంతకు పెరుగుతున్న ముఖేశ్ అంబానీ సంపద... బఫెట్ ను వెనక్కినెట్టిన రిలయన్స్ అధినేత

10-07-2020 Fri 20:59
  • జియో ప్లాట్ ఫామ్స్ లోకి నిధుల వెల్లువ
  • ఎనిమిదో స్థానంలో ముఖేశ్ అంబానీ
  • 68.3 బిలియన్ డాలర్లకు పెరిగిన సంపద
Mukesh Ambani crossed Warren Buffet in Bloomberg Billionaire Index

రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య అధినేత ముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో బెర్క్ షైర్ హాత్ వే అధినేత వారెన్ బఫెట్ ను వెనక్కి నెట్టారు. బ్లూమ్ బెర్గ్ బిలియనర్స్ జాబితాలో ముఖేశ్ అంబానీ 8వ స్థానం దక్కించుకోగా, బఫెట్ 9వ స్థానంలో నిలిచారు. 63 ఏళ్ల అంబానీ ఇటీవల ప్రపంచ కుబేరుల జాబితాలో క్రమం తప్పకుండా నిలుస్తున్నారు. జియో డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లోకి నిధులు వెల్లువెత్తుతుండడంతో రిలయన్స్ షేర్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది.

ఓవైపు కరోనా సంక్షోభం కొనసాగుతున్న తరుణంలోనూ ముఖేశ్ అంబానీ సంపద అంతకంతకు పెరుగుతూ పోతోంది. బ్లూమ్ బెర్గ్ పేర్కొన్న విధంగా అంబానీ నికర సంపద విలువ 68.3 బిలియన్ డాలర్లు కాగా, బఫెట్ ఆస్తి విలువ 67.9 బిలియన్ డాలర్లు. కాగా, అపర దానకర్ణుడిగా పేరొందిన వారెన్ బఫెట్ 2006 నుంచి 37 బిలియన్ డాలర్లకు పైగా దాతృత్వ సేవలకు విరాళంగా ఇచ్చారు. అప్పటినుంచి ఆయన సంపదలో తరుగుదల కనిపిస్తోంది. ఈ వారంలోనూ 2.9 బిలియన్ డాలర్లు చారిటీ కార్యక్రమాల కోసం దానం చేశారు.

ఇక, ఎప్పట్లాగానే బ్లూమ్ బెర్గ్ కుబేరుల జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ (188 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత స్థానాల్లో బిల్ గేట్స్ (115 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (92.8 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్ బర్గ్ (92.7 బిలియన్ డాలర్లు) తదితరులు ఉన్నారు.