Hydroxychloroquine: హైడ్రాక్సీ క్లోరోక్విన్ వృథా అనేవాళ్లు కనీసం ఒక ప్రత్యామ్నాయం చూపించండి చాలు!: సవాల్ విసిరిన బ్రెజిల్ అధ్యక్షుడు

  • కరోనా బారినపడిన జైర్ బోల్సొనారో
  • హోం క్వారంటైన్ లో ఉన్న అధ్యక్షుడు
  • రోజుకు ఒక హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్ర వేసుకుంటున్నానని వెల్లడి
Brazil president Jair Bolsonaro challenges critics of Hydroxy Chloroquine

ఇటీవలే కరోనా బారినపడిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్ లో ఉన్నానని, కరోనా సోకినప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. అందుకు కారణం హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని అన్నారు. రోజుకు ఒక హైడ్రాక్సీ క్వోరోక్విన్ మాత్ర వేసుకుంటున్నానని, ఎంతో రిలీఫ్ గా ఉందని వివరించారు. ఎంతో బాగా మాట్లాడగలుగుతున్నానని చెప్పుకొచ్చారు.

అయితే, కరోనా చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకంపై విమర్శలు చేస్తున్న వారు కనీసం ఒక ప్రత్యామ్నాయం అయినా చూపించాలని సవాల్ చేశారు. కరోనాతో మొదట్లో కొన్నిరోజులు ఇబ్బందిపడ్డానని, అయితే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు వాడుతున్నప్పటి నుంచి ఎంతో ఉపశమనం కలుగుతోందని చెప్పారు. తన నివాసం నుంచి ఆయన ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా తర్వాత కరోనా కేసుల జాబితాలో బ్రెజిల్ ద్వితీయ స్థానంలో ఉంది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్న బ్రెజిల్ లో ఇప్పటివరకు 17.6 లక్షల మంది కరోనా బారినపడ్డారు. 69 వేలకు పైగా మరణాలు సంభవించాయి.

అధ్యక్షుడు బోల్సొనారో అస్తవ్యస్త విధానాలే దేశంలో కరోనా వ్యాప్తికి కారణమని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నా, బోల్సొనారో మాత్రం అవేవీ పట్టించుకోవడంలేదు. చివరికి తనకు కరోనా సోకినప్పటికీ మాస్కు ధరించడాన్ని ఓ ప్రాధాన్య అంశంగా ఇప్పటికీ గుర్తించడం లేదని విమర్శలు వస్తున్నాయి. కరోనా పాజిటివ్ అని వచ్చిన తర్వాత కూడా ఓ మీడియా సమావేశంలో ఉన్నట్టుండి మాస్కు తొలగించి మాట్లాడడంతో విలేకరులు హడలిపోయారు.

More Telugu News