దేవాలయం కూల్చివేతపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలి: రేవంత్ రెడ్డి

10-07-2020 Fri 18:01
  • సచివాలయం కూల్చివేతలో ధ్వంసమైన ఆలయం, మసీదు
  • దీనికంతటికీ కేసీఆర్, సోమేశ్ కుమార్ కారణమన్న రేవంత్
  • కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపాటు
KCR to be sent to jail demands Revanth Reddy

సచివాలయం కూల్చివేత పనుల్లో అక్కడ ఉన్న నల్లపోచమ్మ దేవాలయం, మసీదు ధ్వంసం కావడం వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ ధనంతో మరింత విశాలంగా వీటిని నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి పేరిట ప్రకటన విడుదలైనప్పటికీ... వివాదం మాత్రం సద్దుమణగడం లేదు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

దీనికంతటికీ సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ కారణమని... వారిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో పెట్టాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంత జరిగినా బీజేపీ నేతలు మాట్లాడటం లేదని... కేసీఆర్ వేసే ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడుతున్నారని మండిపడ్డారు. దేవాలయం కూల్చివేతపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు.

పర్యావరణాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా సీఎస్ సోమేశ్ కుమార్ పెడచెవిన పెట్టారని రేవంత్ విమర్శించారు. కోర్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. ఆలయం, మసీదులను కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.