వికాస్ దూబే చనిపోయాడు కానీ, మరో 10 మంది పుట్టుకొస్తారు: చనిపోయిన పోలీసు అధికారి బంధువు

10-07-2020 Fri 17:40
  • ఆయనకు సహకరించిన వారిని శిక్షించాలి
  • దూబే సాయం తీసుకున్న నేతల సంగతి ఏమిటి?
  • దూబే బతికుంటేనే బాగుండేది
Vikas Dubey Dead But 10 Others Will Replace Him says Killed Cops Relative

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే చనిపోయినంత మాత్రాన ఏమీ కాదని... కొత్తగా మరో 10 మంది దూబేలు పుట్టుకొస్తారని దూబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో హతమైన ఓ పోలీసు అధికారి బంధువు ఆవేదన వ్యక్తం చేశారు. వికాస్ దూబేకు సహకరించిన, ఆయనను సంరక్షించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో వికాస్ దూబే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

దూబే గ్యాంగ్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన డీఎస్పీ బావమరిది ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన బావను చంపిన వ్యక్తి బతికి లేడనే వార్త ఒక్కటే తమకు కొంత న్యాయం జరిగిన ఫీలింగ్ ను కలిగిస్తోందని చెప్పారు. ఒక వికాస్ దూబే చనిపోయాడని... అతని స్థానంలో మరో 10 మంది వస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. వికాస్ కు సహకరించిన వారు, ఆయనను సంరక్షించిన వారు ఇంకా క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో వికాస్ సాయం తీసుకున్న రాజకీయ నేతల విషయం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తుల వల్లే వికాస్ దూబేలాంటి వ్యక్తులు పుట్టుకొస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్ స్టేషన్ లో ఉన్న వ్యక్తిని చంపేసి వికాస్ దూబే అక్కడి నుంచి బయటకు వచ్చాడని... ఇలా ఎలా బయటకు వస్తారని ఆయన ప్రశ్నించారు. దూబే బతికుంటేనే బాగుండేదని... ఆయన వెనకున్న వైట్ కాలర్ నేరగాళ్ల పేర్లు బయటకు వచ్చేవని చెప్పారు. వికాస్ మరణంతో కథ సమాప్తం కాలేదని... ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు.