కేంద్రమంత్రులతో ముగిసిన బుగ్గన బృందం సమావేశాలు... రాష్ట్రానికి రావాల్సిన నిధులపై విజ్ఞప్తి

10-07-2020 Fri 16:36
  • ఢిల్లీ వెళ్లిన బుగ్గన బృందం
  • షెకావత్, నిర్మల సీతారామన్ లతో భేటీ
  • పోలవరం, జీఎస్టీ బకాయిలపై చర్చ
Buggana meets union ministers in Delhi

రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లతో భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్ తో భేటీలో రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలపై చర్చించిన బుగ్గన బృందం... షెకావత్ తో సమావేశంలో ప్రాజెక్టులకు అందాల్సిన నిధులపై పలు విజ్ఞప్తులు చేసింది. పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలపై, జీఎస్టీ బకాయిలు, తదితర అంశాలపై చర్చించామని బుగ్గన వెల్లడించారు.

కరోనా వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయని, పన్ను వసూళ్లు తగ్గినందున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా తయారైందని వివరించారు. పన్ను వసూళ్లలో తొలి 3 నెలల్లో 40 శాతం లోటు ఏర్పడిందని తెలిపారు. జీఎస్టీ బకాయిలు రూ.3 వేల కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. బకాయిలతో పాటు అదనంగా మరికొన్ని నిధులు ఇచ్చి సహకరించాలని నిర్మలా సీతారామన్ ను కోరామని వివరించారు.

అటు, పోలవరం నిధుల విడుదల జాప్యంలోనూ కరోనానే కారణమైందని బుగ్గన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరామని అన్నారు. నిధుల విడుదలలో జాప్యం లేకుండా రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని వెల్లడించారు. కరోనా ప్యాకేజి కింద రాష్ట్రానికి రావాల్సినవి తప్పకుండా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు.