ఆసుపత్రిపాలైన విలన్ పాత్రల నటుడు పొన్నాంబళం.. అండగా నిలుస్తానన్న కమలహాసన్

10-07-2020 Fri 16:12
  • కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పొన్నాంబళం
  • చెన్నై ఆసుపత్రిలో చికిత్స
  • విచారం వ్యక్తం చేసిన కమల్
Kamal Haasan concenrns over Ponnambalam health

తమిళంతో పాటు తెలుగులోనూ అనేక చిత్రాల్లో విలన్ పాత్రలు వేసిన నటుడు పొన్నాంబళం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యాడు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పొన్నాంబళం ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో ఆక్సిజన్ మాస్క్ తో ఊపిరి తీసుకుంటున్న పొన్నాంబళం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ప్రముఖ నటుడు కమలహాసన్ స్పందించారు.

పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలిసి విచారం వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయం అందిస్తానని, అతని పిల్లలను చదివించే బాధ్యతను స్వీకరిస్తానని భరోసా ఇచ్చారు. పొన్నాంబళం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా కమల్ తన సిబ్బందికి సూచనలు చేశారు.

స్టంట్ మ్యాన్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పొన్నాంబళం... కమలహాసన్, రజనీకాంత్ ల చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనూ అనేక ప్రతినాయక పాత్రలు చేశాడు. కొంతకాలం కిందట తమిళ బిగ్ బాస్ లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు  దగ్గరయ్యాడు.