మళ్లీ భారత్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న టిక్ టాక్

10-07-2020 Fri 15:26
  • భారత్-చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు
  • టిక్ టాక్ పై నిషేధం విధించిన భారత్
  • ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి తరలిస్తున్న టిక్ టాక్
Tik Tok decides to shift head office from Beijing

భారత్-చైనా సరిహద్దు గొడవలు టిక్ టాక్ కొంప ముంచాయి. తాజా పరిణామాలు భారత్ వంటి భారీ మార్కెట్ ను ఆ యాప్ కు దూరం చేశాయి. చైనాతో ఘర్షణల నేపథ్యంలో భారత ప్రభుత్వం 59 చైనా యాప్ లపై నిషేధం విధించగా, వాటిలో టిక్ టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో, తనపై పడిన చైనా ముద్రను తొలగించుకునేందుకు ఈ ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ కీలక చర్యలు తీసుకుంటోంది. బీజింగ్ లో ఉన్న తన ప్రధాన కార్యాలయాన్ని ప్రపంచంలో మరో చోటకు తరలించేందుకు సన్నద్ధమవుతోంది. అయితే, ఎక్కడికి తరలిస్తారన్నది ఇంకా ప్రకటించలేదు.

వాస్తవానికి ప్రధాన కార్యాలయం తరహాలో ముంబయి, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, డబ్లిన్ నగరాల్లో టిక్ టాక్ యాప్ కు భారీ కార్యాలయాలు ఉన్నాయి. కానీ, ప్రధాన కార్యాలయం బీజింగ్ లో ఉండడంతో టిక్ టాక్ పై చైనా ప్రభుత్వం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనేక దేశాలు భావిస్తున్నాయి. టిక్ టాక్ పై నిషేధం విధించేందుకు తాము కూడా సన్నద్ధమవుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవలే వెల్లడించారు.

వీటన్నింటి నేపథ్యంలో, చైనా నుంచి బయటికి వచ్చేయడంతో పాటు, మాతృసంస్థ బైట్ డ్యాన్స్ లో కూడా మార్పులు చేయాలని భావిస్తున్నట్టు టిక్ టాక్ యాజమాన్యం వెల్లడించింది.