చిత్తూరు జిల్లా నగరిలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా!

10-07-2020 Fri 15:17
  • నిన్న రాత్రి చనిపోయిన 84 ఏళ్ల వ్యక్తి
  • వారం క్రితమే ఆయన భార్య మృతి
  • నగరిలో భారీగా పెరుగుతున్న కేసులు 
22 members of a family tested positive in Nagari

ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 25 వేలను దాటింది. చిత్తూరు జిల్లాలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే 2,200 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా నగరిలో ఒకే కుటుంబంలో 22 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. 84 ఏళ్ల వయసున్న ఒక ప్రముఖ వ్యక్తి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి అనారోగ్యంతో నిన్న వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి చనిపోయారు. ఆయనది ఉమ్మడి కుటుంబం. నలుగురు కుమారులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లతో పట్టణంలోనే పెద్ద కుటుంబంగా పేరుంది.

వారం క్రితం ఆయన భార్య చనిపోయారు. దీంతో, అంత్యక్రియలకు తమిళనాడు నుంచి బంధువులు వచ్చారు. ఆ తర్వాత మూడు రోజుల క్రితం ఆయన కుమారుడు కరోనా కారణంగా ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం వారి కుటుంబంలో 16 మందికి, పక్కింట్లో ఉన్న ఆయన తమ్ముడి కుటుంబంలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. మరోవైపు, అదే వీధిలో ఉన్న ఒక వైద్యుడితో పాటు ఆయన ఇంట్లో ఉన్న ఐదుగురికి 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది.