తెలంగాణ పాత సచివాలయంలో మసీదు కూల్చివేత... స్పందించిన ఒవైసీ

10-07-2020 Fri 15:11
  • తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణం
  • పాత భవనాలను కూల్చుతున్న సర్కారు
  • సచివాలయ ప్రాంగణంలోని మసీదు, ఆలయం కూల్చివేత 
  • విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్
 Asaduddin Owaisi responds after Mosque demolished in Telangana secretariat

తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మించేందుకు పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సచివాలయంలోని మసీదు, ఆలయాలు కూడా కూల్చివేయడంపై విచారం వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన చేసింది. ఈ ప్రకటనపై స్పందించిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. దీనిపై యునైటెడ్ ముస్లిం ఫోరమ్ త్వరలో సవివరంగా ప్రకటన చేస్తుందని వెల్లడించారు.

దీనిపై తాను మసీదు, ఆలయ నిర్వాహకులతో సమావేశం అవుతానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారని, కొత్త సచివాలయంతో పాటే మసీదు, ఆలయ నిర్మాణాలు కూడా కొత్తవి చేపడతామని, ఇది తన హామీ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని అసదుద్దీన్ వివరించారు. తెలంగాణ పూర్తిగా లౌకికవాద రాష్ట్రమని, కానీ, మసీదు, మందిరం కూల్చివేత ఊహించనిరీతిలో జరిగిపోయిందని సీఎం విచారం వ్యక్తం చేశారని, దీన్ని రాగద్వేషాలకు అతీతంగా చూడాలంటూ ఆయన అభ్యర్థించారని పేర్కొన్నారు.