నెల్లూరు జిల్లాను విభజించాల్సిన అవసరంలేదు... అలా చేస్తే షార్, కృష్ణపట్నం తిరుపతి పరిధిలోకి వెళతాయి: సోమిరెడ్డి

10-07-2020 Fri 14:38
  • ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు
  • నెల్లూరు తదితర జిల్లాలను పెంచాల్సిన పనిలేదన్న సోమిరెడ్డి
  • 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని వెల్లడి
  • అప్పుడు మళ్లీ జిల్లాలు మార్చుతారా? అని ప్రశ్న
Somireddy suggests do not divide Nellore District

ఏపీలో పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడప, శ్రీకాకుళం వంటి జిల్లాలను విభజించాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. విజయనగరం, నెల్లూరు వంటి జిల్లాలను వీడదీసి జిల్లా సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు.

 లోక్ సభ స్థానం ప్రాతిపదికన నెల్లూరు జిల్లాను విభజించాలనుకుంటే జిల్లా అభివృద్ధిలో ఎంతో కీలకమైన కృష్ణపట్నం పోర్టు, శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం (షార్), శ్రీసిటీ సెజ్ అన్నీ తిరుపతి పరిధిలోకి వెళతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, పెద్ద జిల్లాలను విడదీస్తే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని స్పష్టం చేశారు.

2026లో మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అప్పుడు మరోసారి పార్లమెంటు నియోజకవర్గాల హద్దులు మారిపోతాయని సోమిరెడ్డి అన్నారు. అప్పుడు మళ్లీ జిల్లాలను మార్చుతారా? అంటూ ప్రశ్నించారు. మేం అనుకున్నది చేసేస్తాం అనే ధోరణిని ప్రభుత్వం విడనాడాలని హితవు పలికారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లా అనడం సహేతుకంగా లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేసి ఏమాత్రం ప్రాముఖ్యత లేకుండా చేశారని విమర్శించారు.