ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంకా గాంధీ... సామాన్లు సోనియా నివాసానికి తరలింపు!

10-07-2020 Fri 11:46
  • ఖాళీ చేయాలని గతవారం కేంద్రం ఆదేశం
  • త్వరలోనే లక్నోకు మకాం మార్చనున్న ప్రియాంక
  • యూపీలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం
Priyanka Gandhi Vacates his House in New Delhi

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, న్యూఢిల్లీ, లోధీ రోడ్ లో తాను నివాసం ఉంటున్న భవనాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ఖాళీ చేస్తున్నారు. ఈ ఉదయం ఆ ఇంటి నుంచి సామాన్ల తరలింపు మొదలైంది. తన వ్యక్తిగత సామాన్లను మాత్రం తల్లి సోనియా గాంధీ నివాసమైన 10, జనపథ్ బంగళాకు తరలిస్తున్నారు. కాగా, ఆగస్టు 1లోగా భవనాన్ని ఖాళీ చేయాలని గతవారంలో కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆమెకు కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను కూడా తొలగించారు.

కాగా, తాత్కాలికంగా సోనియా నివాసానికి సామాన్లను చేర్చినా, త్వరలోనే ఆమె యూపీలోని లక్నోకు మకాం మారుస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. లక్నోలోని కేంద్ర మాజీ మంత్రి, నెహ్రూ సమీప బంధువు షీలాకౌల్ భవనంలో ప్రియాంకా గాంధీ, ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఆ ఇంటికి ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపాయి. యూపీలో తదుపరి జరిగే అవెంబ్లీ ఎన్నికల నాటికి, ఆ రాష్ట్రంలోనే మకాంవేసి, పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంలో ప్రియాంక ఉన్నారన్న సంగతి తెలిసిందే.