లాక్‌డౌన్‌తో హైదరాబాద్ మెట్రో కుదేలు.. రూ. 200 కోట్లకు చేరువలో నష్టాలు!
- లాక్‌డౌన్ కారణంగా మార్చి 22 నుంచి నిలిచిపోయిన సేవలు
- రైళ్లు, స్టేషన్ల నిర్వహణ, జీతభత్యాల కోసం నెలకు రూ. 50 కోట్ల ఖర్చు
- నష్టాలు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ
నిజానికి మెట్రో ఇప్పటి వరకు లాభాలు ఆర్జించినదీ లేదు, అలాగని నష్టపోయిందీ లేదు. నగరంలోని మూడు మార్గాల్లో కలిపి రోజుకు సగటున 4.5 లక్షల మంది ప్రయాణించేవారు. దీంతో వచ్చే ఆదాయం అక్కడికక్కడికి సరిపోయేది. అయితే, లాక్‌డౌన్ కారణంగా మార్చి 22 నుంచి సేవలు నిలిచిపోయాయి. సర్వీసులు లేకపోయినా రైళ్లు, స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు తప్పనిసరి కావడంతో అందుకు నెలకు రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది.
ఇది సంస్థకు పెను భారంగా మారడంతో కొవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని భరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో ఉన్నతాధికారులు లేఖ రాసినట్టు తెలుస్తోంది. నిజానికి మెట్రోకు ప్రయాణికుల నుంచి 45 శాతం మాత్రమే ఆదాయం రాగా, 50 శాతం వాణిజ్య స్థలాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా వస్తుంది. మిగతా ఐదు శాతం మాత్రం వాణిజ్య ప్రకటనల ద్వారా వస్తుంది. అయితే, గత నాలుగు నెలలుగా ఇవేవీ లేకపోవడంతో మెట్రో నష్టాల బారిన పయనిస్తోంది.