నాలుగేళ్ల బాబును బోటులో వదిలేసి... హాలీవుడ్ నటి నయా రివీరా ఆత్మహత్య!

  • బోటు అద్దెకు తీసుకుని నదిలోకి వెళ్లిన రివీరా
  • బిడ్డకు లైఫ్ జాకెట్ వేసి, తాను ఆత్మహత్య
  • మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు
Hollywooid Actress Naya Rivera Sucide

హాలీవుడ్ నటి, 'గ్లీ' ఫేమ్ నయా రివీరా, కాలిఫోర్నియాలోని ఓ సరస్సులో దూకి గల్లంతైంది. అద్దెకు తీసుకున్న బోటులో ఆమె నాలుగేళ్ల కుమారుడు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన కొందరు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, రివీరా తన బిడ్డను బోటులోనే వదిలేసి నదిలో దూకింది. ఈ ఘటన లాస్ పాడ్రెస్ నేషనల్ ఫారెస్ట్ లోని పిరూ లేక్ లో జరిగింది. ఈ ప్రాంతం లాస్ ఏంజిల్స్ కు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఆచూకీ కోసం సెర్చ్ టీమ్ ను రంగంలోకి దించారు.

మొత్తం 80 మంది రెస్క్యూ టీమ్, హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవల సాయంతో ఆమె కోసం గాలిస్తున్నారు. వీరిలో డైవర్లు కూడా ఉన్నారని ఆ ప్రాంత పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆమె కోసం బుధవారమంతా గాలించామని, చీకటి పడిన తరువాత ఆపరేషన్స్ నిలిపి, గురువారం తిరిగి ప్రారంభించామని, ఇంకా నయా రివీరా ఆచూకీ లభించలేదని తెలిపారు. ఆమె బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఓ బోటును అద్దెకు తీసుకుంది. ఆపై తన కుమారుడితో కలిసి నదిలో విహారానికి వెళ్లింది.

ఆపై చాలా సేపటి తరువాత, మరొకరు బోటును తీసుకుని సరస్సులోకి వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బోటులోని రివీరా కుమారుడు లైఫ్ జాకెట్ వేసుకున్న పరిస్థితుల్లో కనిపించాడు. ఆమె మాత్రం అందులో లేదని పోలీసు అధికారి ఎరిక్ బుశ్చోవ్ వెల్లడించారు. ఆమె మరణించి వుండవచ్చని, ఈ విషయాన్ని ఇప్పుడే స్పష్టం చేయలేమని అన్నారు.

More Telugu News