బ్రేకింగ్... అనూహ్య పరిస్థితుల్లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ లో మృతి!

10-07-2020 Fri 08:10
  • కాన్పూర్ తీసుకుని వస్తుండగా కారు బోల్తా
  • తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నించిన దూబే
  • పోలీసు కాల్పుల్లో మృతి
  • ఘటనపై పలు అనుమానాలు
Vikas Dubey Encountered near Kanpur

ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అనూహ్య రీతిలో ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. నిన్న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో వికాస్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆపై అతన్ని కట్టుదిట్టమైన భద్రత నడుమ కాన్పూర్ కు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ తెల్లవారుజామున వికాస్ దూబేను తీసుకుని వస్తున్న వాహనం కాన్పూర్ సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఆపై వెంటనే తప్పించుకుని పారిపోయేందుకు వికాస్ దూబే ప్రయత్నించాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో అతను హతమయ్యాడు.

కాగా, ఎనిమిది మంది పోలీసులను వికాస్ గ్యాంగ్ హత్య చేసిన తరువాత, పోలీసులు అతనిపై పగతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. గడచిన ఐదు రోజుల్లో వికాస్ గ్యాంగ్ లోని పలువురిని పోలీసులు కాల్చి చంపారు కూడా. ఈ క్రమంలో తమపై వచ్చిన ఒత్తిడితోనే వికాస్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారని కూడా వార్తలు వస్తున్నాయి. పోలీసు అధికారులు మాత్రం ఈ వార్తలను ఖండించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.