'అయామ్ వికాస్ దూబే' అని అనగానే... లాగి ఒక్కటిచ్చిన పోలీసు... వీడియో ఇదిగో!

10-07-2020 Fri 08:04
  • ఉజ్జయినిలో అరెస్ట్ అయిన వికాస్ దూబే
  • తరలించే క్రమంలో కాసేపు ఘర్షణ
  • వికాస్ చెంపపై పోలీసు దెబ్బ
Vikas Dubey Slapped by Police

యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను నిన్న మధ్యప్రదేశ్ పోలీసులు ఉజ్జయినిలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వికాస్ దూబేను అక్కడి నుంచి తరలిస్తున్న క్రమంలో, ఓ ఆసక్తికర ఘటన జరుగగా, అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. తనను పోలీసులు వ్యాన్ లోకి ఎక్కిస్తున్న క్రమంలో "అయామ్ వికాస్ దూబే ఆఫ్ కాన్పూర్" (మే వికాస్ దూబే హూ... కాన్పూర్ వాలా) అని గట్టిగా అరిచాడు. అంతే... ఓ పోలీసు చెంపపై లాగి ఒక్కటిచ్చాడు. 'ఆవాజ్ నహీ' (కీప్ క్వయిట్) అంటూ వార్నింగ్ ఇచ్చి వ్యాన్ లోపలికి తోసేశాడు.

ఆరు రోజుల క్రితం తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేసి, 8 మందిని వికాస్ హతమార్చిన సంగతి తెలిసిందే. స్థానిక పోలీసుల నుంచే తన అరెస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న వికాస్, ముందే ప్లాన్ తో ఉండి, భవనాల పై నుంచి తన మనుషులతో పోలీసు బృందంపై ఏకే-47లు సహా, పలు రకాల ఆయుధాలతో దాడికి దిగాడు. ఆపై అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి, కాన్పూర్ కు 700 కిలోమీటర్ల దూరంలోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం సమీపంలో పట్టుబడటం గమనార్హం.