Lockdown: మళ్లీ లాక్‌డౌన్‌తో ప్రయోజనం ఉండదు!: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

  • ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్‌ను కట్టడి చేయొచ్చు
  • కరోనా వచ్చి, పోతుంటుంది
  • కేసీఆర్ కనపడకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతున్నాయా? 
talasani on lockdown in hyderabad

హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని వస్తోన్న ప్రచారంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కరోనాను ఎదుర్కొనే క్రమంలో లాక్‌డౌన్ వల్ల లాభం ఉండదని చెప్పారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్‌ను కట్టడి చేయొచ్చని తెలిపారు. కరోనా వచ్చి పోతుంటుందని, అందుకు తెలంగాణ మంత్రి మహమూద్ అలీతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. వారు కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే.

కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ కనపడకుండా పోయారని, ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని టీపీసీసీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై తలసాని మండిపడ్డారు. కేసీఆర్ కనపడకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతున్నాయా? అని ప్రశ్నించారు. నిన్న వ్యవసాయ అధికారులతో కేసీఆర్ ఫోనులో మాట్లాడారని ఆయన తెలిపారు.

బీజేపీ నేతలు కూడా కరోనాపై బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వారికి చేతనైతే ప్రధాని మోదీతో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలని సవాలు విసిరారు. కరోనా వ్యాప్తి ప్రారంభంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను చప్పట్లు కొట్టాలని, దీపాలు  వెలిగించాలని చేసిన వ్యాఖ్యలపై తాము ప్రశ్నించలేదు కదా? అని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మంచి సదుపాయాలున్నాయని ఆయన చెప్పారు.

More Telugu News