ధోనీ ఇప్పుడప్పుడే రిటైర్ కాడు.. పుకార్లకు తెరదించిన మేనేజర్

09-07-2020 Thu 12:17
  • ధోనీని చాలా దగ్గరి నుంచి చూశా
  • ఐపీఎల్ ఆడాలన్న ఆలోచనతో చెన్నైలో ప్రాక్టీస్ ప్రారంభించాడు
  • లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్లీ మొదలు పెడతాడు
MS Dhonis manager provides huge update on former India captains future

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న పుకార్లకు అతడి మేనేజర్ మిహిర్ దివాకర్ తెరదించాడు. ధోనీకి ఇప్పుడప్పుడే రిటైర్ అయ్యే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశాడు. తామిద్దరం స్నేహితులం కాబట్టి అతడి క్రికెట్ గురించి తాము మాట్లాడుకోమని, కాకపోతే ధోనీని చాలా దగ్గరి నుంచి చూశాను కాబట్టి అతడి రిటైర్మెంట్ గురించి తాను చెప్పగలనని పేర్కొన్నాడు. ఐపీఎల్ ఆడాలని ధోనీ ఎంతో ఆశగా ఉన్నాడని, అతడికి ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనలు లేవని తేల్చి చెప్పాడు.

ఐపీఎల్ ఆడాలన్న ఆలోచనలో ఉన్న ధోనీ లాక్‌డౌన్‌కు నెల రోజుల ముందు నుంచే చెన్నైలో ప్రాక్టీస్ మొదలు పెట్టాడని మిహిర్ చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్ ఎత్తివేశాక తిరిగి ప్రాక్టీస్ మొదలుపెడతాడని పేర్కొన్నాడు. ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీ రిటైర్మెంట్ కాబోతున్నాడంటూ పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తూనే ఉన్నా, ధోనీ మాత్రం ఇప్పటి వరకు వాటిపై పెదవి విప్పలేదు. ఇప్పుడతడి మేనేజర్ ఈ వార్తలపై స్పష్టత ఇవ్వడంతో ఇకనైనా ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడుతుందో, లేదో వేచి చూడాలి.