అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భార్య మెలానియా విగ్రహానికి నిప్పు

09-07-2020 Thu 11:56
  • మెలానియా ట్రంప్ స్వస్థలం స్లోవేనియాలో విగ్రహం
  • అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే నిప్పు
  • ఈ ఏడాది మొదట్లో ట్రంప్ విగ్రహానికి కూడా నిప్పు పెట్టిన దుండగులు
Melania trump wooden statue set on fire in slovenia

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భార్య మెలానియా విగ్రహానికి కొందరు దుండగులు నిప్పు పెట్టారు. మెలానియా స్వస్థలమైన స్లోవేనియాలో ఏర్పాటు చేసిన ఆమె చెక్క విగ్రహానికి ఈ నెల 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే నిప్పు పెట్టినట్టు విగ్రహాన్ని తయారు చేసిన కళాకారుడు, బెర్లిన్‌కు చెందిన అమెరికన్ ఆర్టిస్ట్ బ్రాడ్ డౌనీ తెలిపారు. విగ్రహం దెబ్బతిన్న విషయాన్ని ఆ తర్వాతి రోజు పోలీసులు తనకు సమాచారం ఇవ్వడంతో దానిని తొలగించినట్టు ఆయన వివరించారు.

మెలానియా ట్రంప్ విగ్రహానికి నిప్పు ఘటన అమెరికాలో రాజకీయ చర్చకు కారణమవుతుందని భావిస్తున్నట్టు డౌనీ పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై అమెరికా ఇప్పటి వరకు స్పందించలేదు. విగ్రహానికి నిప్పు ఘటనపై దర్యాప్తు పూర్తి కాకపోవడంతో ఎలాంటి వివరాలు వెల్లడించలేమని వాషింగ్టన్‌లోని మెలానియా కార్యాలయం పేర్కొంది. కాగా, స్లోవేనియాలో ఏర్పాటు చేసిన డొనాల్డ్ ట్రంప్ చెక్క విగ్రహాన్ని కూడా ఈ ఏడాది జనవరిలో కొందరు దుండగులు దహనం చేశారు.