vikas dubay: కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే అలా దొరికిపోయాడు..!

  • ఉజ్జయిని మహాకాళీ మందిరానికి దూబే వచ్చాడన్న కలెక్టర్
  • అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతడిని గుర్తించారు
  • వెంటనే పోలీసులకు సమాచారం అందించారు
  • పోలీసులు వచ్చి పట్టుకున్నారు
  • తాను వికాస్ దూబే అని ఆ గ్యాంగ్‌స్టర్‌ ఒప్పుకున్నాడు
police arrests dubay in madhyapradesh

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. తనని పట్టుకోగానే 'నేను వికాస్‌ దూబేని... కాన్పూర్‌కి చెందిన వాడిని' అని గట్టిగా అరిచాడు. కాగా, అతడి కోసం యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కీలక ప్రాంతాల్లో పోలీసులు దూబే ఫొటోతో పోస్టర్లు కూడా అంటించి, అతడిని పట్టిస్తే రూ.5 లక్షల రివార్డు కూడా ఇస్తామని ప్రకటించారు.

ఈ క్రమంలో అతడి గురించి మధ్యప్రదేశ్‌లోని వారికి కూడా తెలిసింది. కాన్పూర్ లో ఎన్‌కౌంటర్‌ అనంతరం దూబే మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించి అక్కడి పలు ప్రాంతాల్లో ముఖానికి మాస్కు, నకిలీ గుర్తింపు కార్డుతో తిరుగుతున్నాడు. దూబేను గుర్తించింది ఉజ్జయిని మహాకాళీ ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అని అధికారులు తెలిపారు.

'దైవ దర్శనానికి ఉజ్జయిని మహాకాళీ మందిరానికి వికాస్‌ దూబే వచ్చిన సమయంలో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతడిని గుర్తించారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు దూబేను పట్టుకున్నారు. తనను పట్టుకోగానే తాను వికాస్ దూబేనని ఆ గ్యాంగ్‌స్టర్‌ ఒప్పుకున్నాడు. దర్యాప్తు కొనసాగుతోంది' అని ఉజ్జయిని కలెక్టర్ ఆశిష్ సింగ్ వివరించారు.

ఇదిలావుంచితే, పోలీసులు అతడిని పట్టుకోగానే వారితో కాసేపు వాగ్వివాదానికి దిగినట్లు తెలిసింది. దూబేను పోలీస్ స్టేషన్‌లో కాకుండా రహస్య ప్రాంతంలో ఉంచి, ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అతడిపై పలు హత్యారోపణలు సహా మొత్తం 60కి పైగా కేసులు ఉన్నాయి.  

యోగి ఆదిత్యనాథ్‌కి మధ‌్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ఫోన్

 
వికాస్‌ దూబేను పోలీసులు అరెస్టు చేయగానే ఈ విషయంపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి మధ‌్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ఫోన్ చేసి, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. మధ్యప్రదేశ్‌ పోలీసులకు యోగి అభినందనలు తెలిపారు.

More Telugu News