హైదరాబాద్‌లో ర్యాపిడ్ టెస్టులు ప్రారంభం.. ఇక అరగంటలోనే ఫలితం

09-07-2020 Thu 10:01
  • ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల స్థానంలో ర్యాపిడ్ టెస్టులు
  • పరీక్షల్లో పాజిటివ్ వస్తే కొవిడ్ సోకినట్టే
  • తొలి రోజు మూడు జిల్లాలలో 700 మందికిపైగా పరీక్షలు
Telangana govt starts Rapid tests in GHMC

పెరుగుతున్న కరోనా కేసులతో భయపడుతున్న గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఇది శుభవార్తే. జీహెచ్ఎంసీ పరిధిలో నిన్నటి నుంచి ర్యాపిడ్ యాంటిజెన్ కొవిడ్-19 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ టెస్టుల ద్వారా కేవలం అరగంటలోనే ఫలితం తెలుసుకోవచ్చు. ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో 25 మందికి పరీక్షలు చేయనుండగా, తొలి రోజు మూడు జిల్లాల్లో ఆరేడు వందల మందికి పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో 50 అర్బన్ హెల్త్ సెంటర్లు, రంగారెడ్డి జిల్లాలో 20, మేడ్చల్‌లో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్‌టీ-పీసీఆర్) విధానంలో కరోనా పరీక్షలు చేయగా, ఇప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో తొలిసారి పాజిటివ్ ఫలితం వస్తే రెండోసారి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, నెగటివ్ వస్తే మాత్రం ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకుని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.