'మైసూర్ పాక్‌తో కరోనా ఖతం' అంటూ ప్రచారం.. స్వీట్ షాపును సీల్ చేసిన అధికారులు

09-07-2020 Thu 09:42
  • తమిళనాడులోని కోయంబత్తూరులో ఘటన
  • సిద్ధ వైద్యాన్ని ఉపయోగించి మైసూరు పాక్ తయారీ అంటూ ప్రకటన
  • 120 కిలోల మైసూరు పాక్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు
Coimbatore sweet shop announce mysore pak will cure corona virus

తమ దుకాణంలో తయారు చేసే మైసూరు పాక్‌లో ఔషధ గుణాలు ఉన్నాయని, దానిని తింటే కరోనా ఖతమైపోతుందంటూ ప్రకటనలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్న స్వీట్ షాపును పోలీసులు సీజ్ చేశారు. తమిళనాడు, కోయంబత్తూరులోని తొట్టిపాళెయంలో జరిగిందీ ఘటన. ఇక్కడి తిరునెల్వేలి లాలా స్వీట్ షాపు నిర్వాహకుడు తమ దుకాణంలో తయారు చేసే మైసూరు పాక్‌లో ఔషధ గుణాలు ఉన్నాయని, దానిని తింటే ఒక్క రోజులోనే కరోనా మటాష్ అయిపోతుందని ప్రచారం చేస్తూ మూడు నెలలుగా ప్రకటనలిస్తున్నాడు.

తన తాత నేర్పించిన సిద్ధ వైద్యం నిబంధనల ప్రకారం ఔషధ మైసూరు పాక్‌ను తయారు చేస్తున్నట్టు పేర్కొన్నాడు. దీనిని తింటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి కరోనా తగ్గిపోతుందని చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం తెలిసిన ఆహార, ఆరోగ్యశాఖ, వైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా చేయడం తప్పని చెప్పి దుకాణానికి సీల్ వేశారు. దుకాణం నుంచి 120 కిలోల మైసూరు పాక్‌ను స్వాధీనం చేసుకున్నారు.